గట్టిగా అనుకోండి – నారంశెట్టి ఉమామహేశ్వరరావు
‘మంచి ఇల్లుంటే హాయిగా చదువుకునేవాణ్ణి’. ‘ఫీజులు కట్టడానికి డబ్బుంటే ఇష్టమున్న కోర్సులు చదివి మంచి ఉద్యోగం సంపాదించేవాణ్ణి’. ‘ఈ పల్లెటూళ్ళో కాకుండా ఏ నగరంలోనో ఉండి ఉంటే గొప్ప అవకాశాలు దక్కేవి” . ఇలాంటి మాటల్ని తరచు వింటుంటాం. నిజానికి వారికి లేనివి అవేవీ కావు. ఒక్క పట్టుదల మాత్రమే.
ఒక పాఠశాలలో సైకిల్ పోటీ జరుగుతోంది. పిల్లలంతా కొత్త సైకిళ్లు తెచ్చుకుని తయారుగా ఉన్నారు. కొందరైతే సైకిళ్లను రంగుల కాగితాలతో ముస్తాబు చేసి మరీ తెచ్చుకున్నారు. పాత సైకిల్ తెచ్చుకున్న ఒకబ్బాయిని చూసి ‘దీంతో నువ్వు గెలిచినట్లే’ అంటూ హేళన చేస్తున్నారు మిగిలిన పిల్లలు. నిజానికి అది కూడా ఆ అబ్బాయి సొంతం కాదు. పక్కింటి వాళ్ళని బతిమాలి తెచ్చుకున్నాడు. పిల్లల మాటలు విని అతడికి ఏడుపొచ్చింది. పోటీలో నెగ్గితే వచ్చే డబ్బుతో పుస్తకాలు కొనుక్కోవాలనుకున్నాడు. టీచర్ దగ్గరకెళ్లి ‘డొక్కు సైకిల్ తో పోటీలో పాల్గొనకూడదా?’ అనడిగాడు భయంగా . ‘సైకిల్ కొత్తదా పాతదా అన్నది కాదు. ఎంత వేగంగా తొక్కావన్నది ముఖ్యం . పోటీ గెలిచి వాళ్ళకి జవాబు చెప్పు” అని ధైర్యం చెప్పారు టీచర్. దాంతో ఉత్సాహంగా వెళ్లి ప్రథమ బహుమతి గెలుచుకొచ్చాడు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ గెలవాలని పట్టుదలగా ప్రయత్నించాడు. గెలిచాడు. ఆ అబ్బాయి పేరు ఆంథోని రాబిన్స్ .
ఈ రోజు అమెరికాలో గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, శిక్షకుడిగా పేరు పొందాడు ఆంథోనీ రాబిన్స్. అతని బాల్యంలో ఎన్నో కష్టాలనుభవించాడు. అమెరికాలోని ఉత్తర హాలీవుడ్ , కాలిఫోర్నియాలో పుట్టాడు. అతడికి ఏడేళ్లప్పుడే అమ్మానాన్నలు విడిపోయారు. తల్లి మరో పెళ్లి చేసుకుంది. పేదరికమూ, ప్రేమరాహిత్యమూ ఆ అబ్బాయిని రాటు దేల్చాయి. జీవితంలో ఎదగాలన్న పట్టుదలను పెంచాయి.
పదిహేడేళ్ళ వయసులో కాలేజీలో చేరకుండా ఇల్లు వదిలి తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేశాడు.
ఒకసారి దగ్గర బంధువు ఒకర్ని అతడి విజయానికి కారణమేంటి అని అడిగాడు ఆంథోనీ. మోటివేషనల్ స్పీకర్ జిమ్ రాన్ ప్రసంగం విన్నప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని చెప్పాడతడు. దాంతో జిమ్ రాన్ ప్రసంగాలకు ప్రచారం చేయడంతో మొదలెట్టి క్రమంగా తానే మోటివేషనల్ స్పీకర్ అయిపోయాడు ఆంథోనీ రాబిన్స్ . సెల్ఫ్ హెల్ప్ కి సంబంధించి పలు పుస్తకాలు రాశాడు. అతడు రాసిన అన్ లిమిటెడ్ పవర్, అవేకిన్ ది జెయింట్ వితిన్ అనే పుస్తకాలు 56 భాషల్లోకి అనువాదమై సంచలనం సృష్టించాయి. ఇప్పుడతడు అమెరికాలోని ధనవంతుల్లో ఒకడయ్యాడు. ఒకప్పుడు ఇతరులతో కలిసి చిన్న గదిలో సర్దుకుపోయిన ఆంథోని రాబిన్స్ కి ఇప్పుడు విలాసవంతమైన భవనాలూ , సొంత విమానాలూ ఉన్నాయి. తన సంపాదనలో ఎక్కువ భాగం పేదల కోసం ఖర్చు చేస్తున్నాడు. తన సంస్థల ద్వారా లక్షలాది మంది పేదలకు బిలియన్ బోజనాలను అందించినందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పుకున్నాడు ఆంథోనీ.
గట్టిగా అనుకోవాలే గానీ సాధించలేనిది ఏదీ లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? కుంటి సాకులు చెప్పి , కాలం వెళ్లబుచ్చే వాళ్ళకి ఆంథోనీ ఎదుగుదల ఒక పాఠం అయ్యింది. అతన్ని చూసి ప్రేరణ పొందితే అడ్డంకులను అధిగమించి అనుకున్నది సాధించవచ్చు.